పాఠ్యభాగం
నేపథ్యం: మన చుట్టూ ఉండే సమాజంలో మనకు తెలియకుండానే శ్రమదోపిడీ ఎలా జరుగుతుందో చాగంటి సోమయాజులు బొండుమల్లెలు పాఠం ద్వారా చెప్పదలచుకున్నారు. శ్రమకి తగిన ప్రతిఫలం అందరికీ లభించాలి. దోపిడీ వ్యవస్థ పోవాలనేది ఈ పాఠం నేపథ్యం.
ప్రక్రియ - కథానిక : కథ - కథానిక అనే మాటలను ఇప్పుడు పర్యాయ పదాలుగా వాడుతున్నాం. వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది కథానిక. ఇది వచన ప్రక్రియ. క్లుప్తత దీని ప్రధాన లక్ష్యం. పాత్రలూ, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవికత చిత్రణ కథానికలో భాగాలు.
పాత్రలు - స్వభావాలు
తాత: బొండుమల్లెలు పాఠంలో ఒక పాత్ర. పొట్టకూటికోసం కష్టపడి పనిచేసే స్వభావం ఉన్నవాడు. నోరూవాయీ లేదు. గంజి నీళ్లకే సంతోషించేవాడు. కూలి తక్కువైనా అడగనివాడు. వంకాయలమ్మే మనిషి: బొండుమల్లెలు పాఠంలో ముసలితాత మరణించాడని రచయితకు చెప్పింది ఈమే. కూతురు సరిగాచూడక తాత మరణించాడని రచయితకు తెలిపింది.
తాత కూతురు: ఈమె తండ్రికి రోజూ అన్నం పెట్టదు. జీతం ఇచ్చినప్పుడు మాత్రం పట్టెడన్నం పెట్టేది. తండ్రికి జబ్బు చేసినప్పుడు సరిగా చూడకపోవడంతో అతడు మరణిస్తాడు. ఈమె చెడు ఘటికురాలు.
సారాంశం
బొండుమల్లెలు రచయిత ఇందులో కథకుడు. ఇతడి ఇంటి పెరడు ఖాళీగా ఉందని మల్లె మొక్కలు పెంచుదామని అనుకుంటాడు. కానీ ఇది దోపిడీ అవుతుందని అనుకుంటాడు. ధనవంతులే మల్లెపూలు కొంటారు. వాళ్లు ఇతరులను దోచుకుని ధనవంతులవుతారు. తాను వాళ్లని మల్లెలతో దోచుకుంటానని సమర్థించుకుంటాడు. మల్లె మొక్కలు పాతడానికి కూలీ అవసరమవుతాడు. ఒక ముసలి వ్యక్తిని తక్కువ ధరకు మాట్లాడుకుంటాడు. అతడు కష్టపడి మల్లెపూల మొక్కలను పెంచుతాడు. మల్లెలు విరగకాస్తాయి. ముసలి తాతే అమ్మి డబ్బులు తెచ్చేవాడు. తనకు కూలి ఎక్కువ వద్దని, గంజిపోయమని అడుగుతాడు. ముసలి తాత కూతురు దగ్గర ఉంటున్నాడు. కానీ ఆమె సరిగా చూడదు. మల్లెతోట వల్ల రచయితకి ఖర్చులన్నీ పోయి మూడు వందలు లాభం వచ్చింది. తొలకరి వచ్చినా తాత మళ్లీ పనిలోకి రాడు. అతడిని తాత అని పిలవడం తప్పితే అతడి పేరు, నివాసం తెలియదు. ఒక రోజు వంకాయలమ్మే అమ్మాయి చెబుతుంది తాత చనిపోయాడని. కూతురు సరిగా చూడకపోవడంతో జబ్బుతో చనిపోయాడని చెబుతుంది.
తాత చనిపోయాడని తెలిసి రచయిత బాధపడతాడు. బొండుమల్లెలు వేసిందీ, పెంచిందీ, అమ్మిందీ తాతే. కానీ ఫలితం రచయిత పొందాడు. అతడిని దోపిడీ చేసాడు. కష్టం తాతది ఫలితం రచయితది. మనకు తెలియకుండానే ఇతరుల శ్రమని ఏవిధంగా దోపిడి చేస్తున్నామో చాసో ఈ కథలో వివరించారు.
సందర్భాలు
పరిచయం: ఈ వాక్యం చాగంటి సోమయాజులు రచించిన 'చాసో కథలు' అనే సంపుటం నుంచి గ్రహించిన బొండుమల్లెలు కథానికలోది.
సందర్భం: మల్లెతోట పెంచడానికి ఒక ముసలి తాత వస్తే అతడిని చూసి రచయిత పైవిధంగా అనుకున్నాడు.
వివరణ: మల్లెతోట వేయడానికి కూలి మనిషి కావాల్సి రచయిత వెళ్తాడు. అక్కడ ఒక ముసలి తాత వస్తే ఇతడు బలమైనవాడు కాదు. అయిదు రోజుల్లో చేసేపని పదిరోజులు చేస్తాడు. కాబట్టి ఇతడిని పనిలోకి తీసుకోవడం దండగ అని రచయిత భావం.
2. అంత చిత్రంగా ఉంటాయి మన సంబంధ బాంధవ్యాలు.
పరిచయం: ఈ వాక్యం చాగంటి సోమయాజులు రచించిన 'చాసో కథలు' సంపుటిలోని బొండుమల్లెలు అనే కథలోది.
సందర్భం: ముసలి తాత తొలకరికి పనికి రాలేదు. అప్పుడు రచయిత తాత ఎందుకు రాలేదు అని ఆలోచిస్తూ పలికిన సందర్భంలోది.
వివరణ: తొలకరి వచ్చింది. ముసలి తాత పనిలోకి రాలేదు. అతడి గురించి తెలిసినవాళ్లులేరు. ఇన్నాళ్లుగా పనిచేస్తున్నా తాత అనడమే తప్ప అతడి పేరు, ఇల్లు గురించి కనుక్కోలేదని రచయిత బాధపడతాడు. మానవ సంబంధ బాంధవ్యాలు ఇలాగే ఉంటాయి. అవసరం తప్ప అనుబంధం తక్కువ. ఇది విచిత్ర విషయమని రచయిత భావన.
( రచయిత - ఎస్.ఎస్.కె. భగవాన్)

0 comments:
Post a Comment